Dishant Yagnik: ఐపీఎల్ లో కరోనా కలకలం... రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ కు పాజిటివ్
- కరోనా బారినపడిన దిశాంత్ యాగ్నిక్
- యాగ్నిక్ కు 14 రోజుల క్వారంటైన్
- యాగ్నిక్ తో పనిచేసినవాళ్లకు ఐసోలేషన్
కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఐపీఎల్ లోనూ కలకలం రేగింది. రాజస్థాన్ రాయల్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో యాగ్నిక్ కు 14 రోజుల క్వారంటైన్ విధించారు. యాగ్నిక్ తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది.
ఓవైపు భారత్ లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండడంతో ఈ సీజన్ ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించడం తెలిసిందే. విదేశీ గడ్డపై ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ పంపిన ప్రతిపాదనలను కేంద్రం కొన్నిరోజుల కిందటే ఆమోదించింది. కేంద్రం తన నిర్ణయం తెలిపిన రెండ్రోజులకే ఐపీఎల్ లో కరోనా వ్యాప్తి మొదలైంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి.