AIIMS: రష్యా వ్యాక్సిన్ పై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం: ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్
- కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధమయ్యామంటూ రష్యా ప్రకటన
- తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇప్పించామన్న పుతిన్
- ఇది ఏ మేరకు సురక్షితమో చెప్పలేమన్న ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా భూతాన్ని నిలువరించే వ్యాక్సిన్ సిద్ధమైందంటూ రష్యా సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సందేహం వ్యక్తం చేశారు. రష్యా రూపొందించిన వ్యాక్సిన్ సమర్థతను ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. ఈ వ్యాక్సిన్ భద్రత, దీని ప్రభావం తదితర అంశాలపై స్పష్టత లేదని, అప్పటివరకు దీని గురించి ఎలాంటి నిర్ణయానికి రాలేమని అభిప్రాయపడ్డారు. ఎలాంటి దుష్ప్రభావాలు చూపనప్పుడే ఓ టీకా సురక్షితమైనదని చెప్పగలమని, అదే సమయంలో ఇమ్యూనిటీ కలిగించాలని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు.
రష్యాలోని గమాలేయా ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ అన్ని దశలు దాటి, ఉత్పత్తికి సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇప్పించామని తెలిపారు. కరోనా వంటి క్లిష్టమైన వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడం పట్ల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.