Saudi Arabia: కశ్మీర్ పై మీరేం మాట్లాడరేంటని నిలదీసిన పాక్... రుణం, చమురు సరఫరా నిలిపివేసిన సౌదీ!

Saudi gets anger over Pakistan threatening on Kashmir issue

  • కశ్మీర్ పై సౌదీని రెచ్చగొట్టాలనుకున్న పాక్ పన్నాగాలు విఫలం
  • పాక్ బెదిరింపు స్వరాన్ని తీవ్రంగా పరిగణించిన సౌదీ
  • ఇచ్చిన అప్పులో బిలియన్ డాలర్ల వసూలు

కశ్మీర్ అంశంలో భారత్ పై సౌదీ అరేబియాను ఎగదోయాలనుకున్న పాకిస్థాన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని, ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని పాక్ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేసింది. ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం కూడా ఉందని పాక్ విదేశాంగ మంత్రి బెదిరింపు స్వరం వినిపించారు. 57 దేశాల సభ్యత్వం ఉన్న ఓఐసీని కశ్మీర్ అజెండాపై సమావేశపర్చడంలో విఫలమవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కశ్మీర్ అంశంపై తామే ఓఐసీని సమావేశపర్చుతామని అన్నారు.  

అయితే, ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను నిర్మొహమాటంగా వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో, 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్ కు దూరం కానుంది. ఇటీవల ఒప్పందం ముగిసినా మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, పాక్ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న సౌదీ ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకుంది. దాంతో పాక్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

  • Loading...

More Telugu News