Sonu Sood: ఫిలిప్పీన్స్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు మరో విమానం ఏర్పాటు చేసిన సోనూ సూద్ 

Sonu Sood arranges another plane to bring back Indians from Philippines
  • కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులు
  • ఇప్పటికే ఓ విమానం ఏర్పాటు చేసిన సోనూ
  • ఆగస్టు 14న రెండో విమానం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన దాతృత్వానికి పరిమితులు లేవని చాటుకుంటూనే ఉన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సోనూ సూద్ మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది.

 ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. "మీరందరూ మీ కుటుంబాలను కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. మీ కోసమే మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14 సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ వ్యాఖ్యానించారు.

సోనూ సూద్ ఫిలిప్పీన్స్ నుంచి భారతీయులను తీసుకురావడం ఇది రెండోసారి. కొన్నిరోజుల కిందటే మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకుంది. కాగా, కజఖ్ స్థాన్ లో చిక్కుకున్న వారి కోసం కూడా సోనూ ఓ విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం కూడా ఆగస్టు 14న బయల్దేరనుంది.
Sonu Sood
Philippines
Indians
Plane
Manila
New Delhi
Corona Virus
Lockdown

More Telugu News