Mohammad Irfan: ఈ పాకిస్థాన్ పేసర్ బౌలింగ్ చూసి కోహ్లీ ఆశ్చర్యపోయాడట..!
- 2012లో పాక్ జట్టుతో భారత పర్యటనకు వచ్చిన ఇర్ఫాన్
- ఇర్ఫాన్ ఓ సాధారణ బౌలర్ అనుకున్న టీమిండియా సహాయక సిబ్బంది
- గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసిరానని వెల్లడించిన ఇర్ఫాన్
కొన్నాళ్ల కిందట వరకు పాకిస్థాన్ క్రికెట్ ఆశాకిరణం అంటూ ప్రచారం అందుకున్న ఏడడుగుల పొడగరి పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ ఇప్పుడు కొద్దిమేర తెరమరుగైనట్టేనని చెప్పాలి. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "2012లో నేను మొదటిసారిగా భారత్ లో పర్యటించాను. అప్పుడు టీమిండియా అసిస్టెంట్ కోచ్ లు తమ ఆటగాళ్లకు నేనొక సాధారణమైన మీడియా పేసర్ నని, 130 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేయగలనని చెప్పారు. కానీ మ్యాచ్ జరిగే సమయానికి ప్యాడ్ లు కట్టుకుని రెడీగా కూర్చున్న కోహ్లీ నా బౌలింగ్ స్పీడ్ ఎంతో స్పీడ్ గన్ లో చూసి ఆశ్చర్యపోయాడు.
దాదాపు 150 కిమీ వేగంతో నేను బంతులు విసరడాన్ని నమ్మలేకపోయాడు. మొదటి బాల్ 145-146 కిమీ వేగంతో వెళ్లింది. దాంతో స్పీడ్ గన్ లో ఏదో లోపం ఉందనుకున్నాడట. ఆ తర్వాత బంతి 148 కిమీ వేగంతో విసిరాను. దాంతో తన పక్కనున్న వ్యక్తిని కోహ్లీ అరిచినంత పనిచేశాడు. అతడు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తుంటే మామూలు మీడియం పేసర్ అని చెబుతావా అని కోప్పడ్డాడు. కోహ్లీనే ఈ విషయం నాతో చెప్పాడు" అని మహ్మద్ ఇర్ఫాన్ ఆనాటి పర్యటన విశేషాలను పంచుకున్నాడు.