Bihar: బీహార్ లోని కోవిడ్ ఆసుపత్రిలో ఒకే డాక్టర్... భద్రతగా సాయుధ బలగాలు!
- కరోనాకు చికిత్స చేయబోమంటూ డాక్టర్ల వెనుకంజ
- రోగుల బంధువుల నుంచి కాపాడేందుకు భద్రత
- భాగల్ పూర్ కొవిడ్ ఆసుపత్రిలో పరిస్థితి
బీహార్ లోని భాగల్ పూర్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న ఆసుపత్రి అది. అక్కడ ఉన్న డాక్టర్ కుమార్ గౌరవ్ కు ప్రస్తుతం సాయుధ బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. రోగుల బంధువుల నుంచి ఆపద రాకుండా భద్రత కల్పించారు. ఈ ఆసుపత్రిలో ఉన్నది ఆయన ఒక్క డాక్టరే కావడం, బంధువులు ఆయనపై దాడికి దిగే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ కరోనా సోకిన వారు సహా, పలువురు రోగులు చికిత్స పొందుతుండగా, ప్రజల్లో అవగాహనా లేమి కారణంగా ఆసుపత్రిలోని ఐసీయూ వార్డు సహా అన్ని ప్రాంతాలకూ యథేచ్ఛగా వచ్చేస్తుంటారు.
"ఎవరినైనా మేము వారిస్తే, వారు ఆగ్రహానికి లోనవుతుంటారు. తమ వారికి ఇంట్లో చేసిన ఆహారాన్ని ఇవ్వాలని వారు కోరుకుంటుంటారు. కొందరు పేషంట్లతో కాసేపు మాట్లాడి వెళ్లేందుకు వచ్చామంటారు. వారంతా బయటి ఇన్ఫెక్షన్ ను ఆసుపత్రిలోకి తెస్తుంటారు. మా ఆసుపత్రిలోని ఇన్ఫెక్షన్ ను బయటకు తీసుకెళతారు. ఓ రోగి భార్య ఐసీయూలోకి వెళ్లేందుకు వస్తే, మేము గట్టిగా వారించాం. వెనక్కు వెళ్లినట్టే వెళ్లిన ఆమె, మరో మార్గం నుంచి వచ్చి, భర్త దగ్గరకు వెళ్లింది. అలా ఉంటుంది ఇక్కడి పరిస్థితి" అని డాక్టర్ కుమార్ వివరించారు.
ఆసుపత్రిలోని కొన్ని ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక పోవడంతో పలువురు రోగుల బంధువులు విసనకర్రలు తెచ్చి, రోగుల పక్కనే ఉంటున్నారని, వారిని వెళ్లిపోవాలని చెబితే, వారు కోపంతో దాడులకు దిగుతారని వాపోయారు. వారు చేర్చే వ్యర్థాలు కూడా అధికంగానే ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ ఆసుపత్రిలోని పలువురు డాక్టర్లు కరోనాకు చికిత్స చేసేందుకు సుముఖంగా లేక వెళ్లిపోవడంతో, డాక్టర్ కుమార్ ఆసుపత్రిలో మిగిలిపోయారు. ఆయన జూనియర్ కన్సల్టెంట్లు మధుమేహం, బీపీ తదితరాలతో బాధపడుతూ, తమకు కరోనా సోకితే ఆరోగ్యం విషమిస్తుందన్న ఉద్దేశంతో విధులకు దూరంగా ఉండటంతో ఆసుపత్రి బాధ్యతలన్నీ ఒక్క డాక్టర్ పైనే పడ్డాయి.
ఈ సంవత్సరం ఏప్రిల్ లో కరోనా విజృంభణ తరువాత, ఈ ఆసుపత్రిని కేవలం కరోనా రోగులకు మాత్రమే కేటాయించారు. ఈ హాస్పిటల్ కు దగ్గర్లో మరే క్రిటికల్ కేర్ సౌకర్యాలున్న ఆసుపత్రికి వెళ్లాలన్నా, కనీసం 200 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, ఇతర రోగులకు కూడా చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఈ హాస్పిటల్ కు రోగులు, వారి బంధువుల తాకిడి చాలా ఎక్కువ. ఉన్న ఒక్క డాక్టర్ నూ కాపాడుకునేందుకే ఆయనకు రక్షణ కల్పించామని అధికారులు తెలిపారు.