USA: భారత్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందంటూ.. అమెరికా సెనేట్‌లో తీర్మానం
- తీర్మానం ప్రవేశపెట్టిన సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్
- చైనా వైఖరిని ఖండిస్తున్నట్లు వ్యాఖ్య
- చైనా ఆర్మీ రెచ్చగొట్టే తీరు సరికాదని హితవు
- సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తోందని వ్యాఖ్య
భారత భూభాగం విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా తీరును అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ ఎండగట్టారు. చైనా వైఖరిని ఖండిస్తూ సెనేట్‌లో గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఇండియన్ పెట్రోలింగ్ దళాలపై చైనా ఆర్మీ దూకుడు వైఖరి అవలంబిస్తోందని వారు చెప్పారు.
సరిహద్దుల వెంబడి చైనా భారీగా సైన్యాన్ని మోహరిస్తోందని, ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్న తీరును సెనేటర్ కార్నిన్ అభినందించారు. భారత్‌కు తాము అండగా ఉంటామని చెప్పారు.
కాగా, భారత్‌పై సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చైనా పాల్పడుతోన్న తీరు సరికాదని తెలిపారు. జూన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారని వార్నర్ గుర్తు చేశారు. చైనా పాల్పడుతోన్న చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చేలా దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా ఆర్మీ చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై భారత్-చైనా చర్చలు జరిపి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని, ఇంతకు ముందున్న విధంగా ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చెప్పారు.