Prashant Bhushan: కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ఇప్పటి ప్రధాన న్యాయమూర్తిపై భూషణ్ ట్వీట్లు
- అమర్యాద పూర్వక వ్యాఖ్యలు
- శిక్ష విధింపుపై ఈ నెల 20న వాదనలు విననున్న కోర్టు
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు, సీజే జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలతో ట్వీట్లు చేశారనే అభియోగాలతో సీనియర్ న్యాయవాది, ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ, ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో శిక్ష విధింపుపై ఈ నెల 20న వాదనలు వింటామని పేర్కొంది.
కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, కొన్ని రోజుల క్రితం సీజే బోబ్డే ఖరీదైన బైక్ పై హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. దీంతో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బైక్‌పై వెళ్తూ బోబ్డే హెల్మెట్ ధరించలేదని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యపై అభ్యంతరాలు వచ్చాయి. ఆ సమయంలో బోబ్డే బైక్ నడపలేదు. ఆ బైక్ స్టాండ్ వేసి ఉంటే, దానిపై ఆయన కూర్చున్నారు. దీనిపై ప్రశాంత్ భూషణ్ చివరకు క్షమాపణలు చెప్పారు.
ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం కొన్ని రోజులుగా విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ... రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని తాను అభిప్రాయాలను వ్యక్తం చేశానని అన్నారు. బైక్‌కు స్టాండ్ వేసి ఉన్న విషయాన్ని గమనించకుండా ట్వీట్ చేశానని అన్నారు.
తాను కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని చెప్పారు. తనపై ఈ కేసుకు కారణమైన ట్వీట్లు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని, కోర్టు అధికారాన్ని తగ్గించవని వివరణ ఇచ్చారు. దీనిపై ఆగస్టు 3న ఆయన సమర్పించిన అఫిడవిట్‌పై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది.