makkal needhi maiam: పార్టీ స్థాపన వెనక ఎన్నో ఆశయాలున్నాయి.. ఇలాగైతే పార్టీని మూసేస్తా: కమలహాసన్ హెచ్చరిక

makkal needhi maiam chief Kamal Haasan warns to his party men

  • హోటల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో సమావేశం
  • తన భవిష్యత్ జీవితం ప్రజా సేవకే అంకితమన్న కమల్
  • యువతను పార్టీవైపు ఆకర్షించడం ఎలా అన్నదానిపై చర్చ

తన భవిష్యత్ జీవితాన్ని పూర్తిగా ప్రజా సేవకే అంకితం చేశానని, తన రాజకీయ పయనంలో నిర్వాహకుల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ హెచ్చరించారు. అంతేకాదు, ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో పార్టీని స్థాపించానని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే పార్టీని ఎత్తివేసి మరో మార్గంలో ప్రజా సేవకు అంకితం అవుతానని కమల్ స్పష్టం చేశారు.

చెన్నైలోని ఓ హోటల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిందని, 37 అంశాలపై కమల్ చర్చించారని పార్టీ నేత ఒకరు తెలిపారు. పార్టీలోని సమస్యలను తొలుత ప్రస్తావించిన కమల్.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానం, రిజర్వేషన్, టాస్మాక్, విద్యాబోధనలో ద్విభాషా విధానం, రాష్ట్ర అవసరాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలు.. తదితర వాటి గురించి ప్రస్తావించారు.

అలాగే, వచ్చే ఎన్నికల్లో పోటీ, కూటమి అంశాలపైనా చర్చించారు. మక్కల్ నీది మయ్యం హిందూ వ్యతిరేక పార్టీ అంటూ సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు, యువశక్తిని పార్టీవైపు ఆకర్షించడం ఎలా? అన్న దానిపై సలహాలను స్వీకరించారు. ఈ సమావేశంలో మొత్తం 350 మంది నిర్వాహకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News