Air India: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. 48 మంది పైలట్లను తొలగిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు
- తొలగింపునకు గురైన వారు ఎయిర్‌బస్ 320 పైలట్లు
- గతంలో వారంతా రాజీనామా చేసి ఉపసంహరించుకున్న వారే
- ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరిన ఐసీపీఏ
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ గత అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపునకు గురైన వారు ఎయిర్‌బస్ 320 పైలట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం తొలగింపునకు గురైన 48 మంది పైలట్లు గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఆరు నెలల నోటీసులు ఇచ్చారు.
అయితే, ఆ తర్వాత వారు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అర్ధరాత్రి వేళ ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై కలకలం రేగింది. పైలట్ల తొలగింపు ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్‌ను ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) కోరింది. కాగా, తొలగింపునకు గురైన పైలట్లలో కొందరు ప్రస్తుతం విధుల్లో ఉండడం గమనార్హం.