Donald Trump: అమెరికాలో భారతీయుల మద్దతు నాకే ఎక్కువగా ఉంది: కమలా హారిస్‌పై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు
- బిడెన్ తీసుకున్నది చెత్త నిర్ణయం
- కమలా హారిస్‌ను ఎంపిక చేయడం సరికాదు
- బిడెన్ అమెరికా ప్రజల మర్యాదకు భంగం కలిగిస్తున్నారు
- ఆయన ఎన్నికైతే దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరు
భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్‌ను ఆ పదవికి అభ్యర్థిగా ఎంపిక చేస్తానని బిడెన్ ప్రకటించడం ఆయన తీసుకున్న చెత్త నిర్ణయమంటూ ట్రంప్ విమర్శించారు.
అమెరికాలో కమలా హారిస్‌కు ఉన్న భారతీయుల మద్దతు కన్నా తనకు ఉన్న భారతీయుల మద్దతే ఎక్కువని ట్రంప్ చెప్పారు. జో బిడెన్ అమెరికా ప్రజల మర్యాద, గౌరవాలకు భంగం కలిగిస్తున్నారని ఆయన చెప్పారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికతే దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరని చెప్పుకొచ్చారు.
పోలీసులకు అందాల్సిన నిధులను ఆయన అడ్డుకుంటున్నట్లు ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. కాగా, కమలా హారిస్‌పై ట్రంప్ ఇటీవల కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆమె ఓ భయంకరమైన మహిళ అని, ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె అసమర్థత వల్ల తనను ఆకట్టుకోలేదని ఆయన అన్నారు.