flight: రెండు దశాబ్దాల కల నెరవేరిన వేళ.. ఇంటి మేడపై విమాన తయారీ!
- భారత్లోనే విమానాన్ని తయారు చేయాలని లక్ష్యం
- తొలి దశలో విజయవంతంగా గగన విహారం
- రెండో దశ కోసం రెడీ అవుతున్న మహారాష్ట్ర ‘కెప్టెన్’
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే విమానాన్ని తయారుచేశాడు. అంతేకాదు.. దానితో విజయవంతంగా ఆకాశంలో చక్కర్లు కూడా కొట్టాడు. రెండు దశాబ్దాల ఆయన కల సాకారం కావడంతో పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. పూర్తిగా భారత్లో ఓ విమానాన్ని తయారుచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ చేపట్టిన విమాన తయారీ ఎట్టకేలకు సత్ఫలితాలు ఇచ్చింది.
విమానం తొలి దశ పరీక్షలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గతేడాదే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా ఓ టెక్నీషియన్ సాయంతో విమానానికి తొలి దశ పరీక్షలు నిర్వహించారు. రెండో దశ ప్రయోగంలో 2 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరి పరీక్షిస్తామని అమోల్ యాదవ్ తెలిపారు. విమాన పరీక్షల కోసం భారీగా బీమా చేయాల్సి ఉంటుందని, కాబట్టి కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు.