Jawan: ఎనిమిది నెలల కింద గల్లంతై మంచు కింద మృతదేహంలా కనిపించిన ఆర్మీ జవాను
- జనవరిలో కనిపించకుండాపోయిన రాజేంద్ర సింగ్
- స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టిన సైన్యం
- మంచు దిబ్బల కింద సైన్యం కంటబడిన రాజేంద్ర సింగ్ మృతదేహం
భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల పరిస్థితి ఎంత దారుణమో చెప్పే సంఘటన ఇది. ఎనిమిది నెలల కిందట గల్లంతైన ఓ జవాను ఇన్నాళ్ల తర్వాత నియంత్రణ రేఖ వద్ద మంచు కింద విగతజీవుడై కనిపించాడు. కశ్మీర్ గుల్మార్గ్ లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వరిస్తున్న రాజేంద్ర సింగ్ నేగి అనే ఈ జవాను జనవరి నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. రాజేంద్ర సింగ్ ఆచూకీ లేకపోవడంతో అతడు మృతి చెందినట్టు భార్యకు ఆర్మీ అధికారులు లేఖ రాశారు. అయితే తన భర్త మృతదేహాన్ని చూసేంతవరకు తాను అతడి మృతిని నిర్ధారించుకోలేనని ఆమె సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం తనిఖీలు చేపడుతుండగా, మంచు కింద రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని చూశారు. పోస్టుమార్టం అనంతరం జవాను మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజేంద్ర సింగ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని చమోలి గ్రామం. రాజేంద్రసింగ్ 2001లో సైన్యంలో చేరాడు.