Corona Virus: కరోనా టీకాను ఇంత వేగంగా ఎలా తయారు చేయగలిగామంటే...: రష్యా 'గమలేయా' టీమ్ లీడర్ వివరణ
- పరిశోధనలు ప్రారంభించిన 5 నెలల్లోనే వ్యాక్సిన్
- ఎబోలా, మెర్స్ వ్యాక్సిన్ ల తయారీలో ఎంతో అనుభవం
- నిబంధనలకు అనుగుణంగానే వ్యాక్సిన్
గత వారంలో కరోనా మహమ్మారిని దూరం చేసే వ్యాక్సిన్ ను ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పై ఎన్నో దేశాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. చివరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వ్యాక్సిన్ పై తమకు ఎటువంటి సమాచారమూ లేదని చెప్పింది. కేవలం 5 నెలల్లో తాము ఎలా వ్యాక్సిన్ ను సిద్ధం చేశామో చెప్పేందుకు రష్యా ప్రభుత్వ సంస్థ గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు నేతృత్వం వహించిన అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ మీడియా ముందుకు వచ్చారు.
తమ దేశానికి చెందిన వందలాది మంది వైరాలజిస్టులతో పాటు ఇమ్యునాలజిస్టులు, బయో టెక్నాలజిస్టులు గత 20 ఏళ్లుగా చేసిన పరిశోధనల ఫలితంగానే కొవిడ్-19 టీకా తమకింత త్వరగా సాధ్యమైందని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే దీన్ని తయారు చేశామని స్పష్టం చేశారు. గతంలో ఎబోలా, మెర్స్ వ్యాధులకు వ్యాక్సిన్ ను తయారు చేసే విషయంలో తమకు లభించిన అనుభవం కరోనా టీకా త్వరితగతిన రూపొందించేందుకు సహకరించిందని అన్నారు.
తమ దేశ ప్రొటోకాల్ ప్రకారమే, నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను తయారు చేశామని, ప్రపంచంపై మహమ్మారి చూపుతున్న ప్రభావం కారణంగానే వేగంగా దీన్ని తయారు చేశామని అలెగ్జాండర్ తెలిపారు. తాము ఎక్కడా దేశ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.