Srikakulam District: డిశ్చార్జ్ చేసినట్టు చెప్పిన వైద్యులు, ఇంటికి రాని భర్త.. ఆందోళనలో భార్య
- శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఘటన
- కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు
- నెల రోజుల క్రితమే డిశ్చార్జ్ చేసినట్టు చెప్పిన వైద్యులు
కరోనా నుంచి కోలుకున్న తన భర్తను డిశ్చార్జ్ చేయాలంటూ ఆసుపత్రికి వెళ్లిన భార్య హతాశురాలైంది. ఆయనను ఎప్పుడో డిశ్చార్జ్ చేశామని చెప్పడంతో షాక్ అయిన ఆమె తెలిసిన ప్రతిచోటా గాలించినా ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిందీ ఘటన. పట్టణానికి చెందిన శీర శ్రీనివాసనాయుడు (52) జ్వరంతో బాధపడుతూ గత నెలలో రాజాంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా అనుమానితుడిగా గుర్తించి జెమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఫలితాలు నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
అయితే, ఆ తర్వాత కూడా డిశ్చార్జ్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి ప్రశ్నించగా, వారు చెప్పిన సమాధానంతో షాకయ్యారు. గత నెల 17నే డిశ్చార్జ్ చేశామని, క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారేమో చూడాలని చెప్పి అక్కడి నుంచి పంపించారు. మార్చురీ రూములు సహా ఎక్కడ వెతికినా భర్త జాడ కనిపించకపోవడంతో అతడి భార్య రాజేశ్వరి ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసనాయుడి కోసం గాలిస్తున్నారు.