Flood: పొంగుతున్న హుసేన్ సాగర్... భారీగా నీటి విడుదల!
- ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు
- 513 మీటర్లు దాటిన నీటిమట్టం
- లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తం
గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ జలాశయం పొంగి పొరలుతోంది. జలాశయంలో నీటిమట్టం 513.41 మీటర్ల ఎత్తునకు చేరుకోగా, ఇప్పటికే భారీ ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా హిమాయత్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్, దోమల్ గూడ, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో హుసేన్ సాగర్ నుంచి, మూసీ నదిలోకి దారితీసే కెనాల్ వెంట ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కాలువల ద్వారా వరద నీరు హుసేన్ సాగర్ కు భారీగా వస్తోందని తెలిపారు.