Raghu Ramakrishna Raju: జగన్ గారూ.. ఈ అంశాన్ని నేను పార్లమెంటులో లేవనెత్తుతా: రఘురామకృష్ణరాజు

I will raise phone tapping matter in Parliament says Raghu Ramakrishna Raju

  • న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురవుతున్నాయి
  • మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులను పసిగట్టండి
  • ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవకతవకలు జరిగాయి

ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురవుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థపై నిఘా అనే పేరుతో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని చెప్పారు.

పార్క్ హయత్ లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని... ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. లేకపోతే ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. 'జగన్ గారు, మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనే విషయాన్ని పసిగట్టండి' అని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారనే అప్రతిష్టను మూటకట్టుకోవద్దని అన్నారు. తమరి దురభిమానుల నుంచి తనకు ఫోన్ చేయించి, వేధించవద్దని విన్నవిస్తున్నానని చెప్పారు. ఫోన్ ట్యాంపింగ్ అంశంపై చర్యలు తీసుకోకపోతే... ఆ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని అన్నారు.

అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడం సంతోషకరమని రఘురాజు చెప్పారు. హైకోర్టు తీర్పులను పదేపదే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని... ఖరీదైన లాయర్లకు కోట్లాది రూపాయలను చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి బుధవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణలో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో భారీ అవకతవకలు జరిగాయని రఘురాజు ఆరోపించారు. రాజమండ్రి పరిసరాల్లో 600 ఎకరాల భూమిని ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని అన్నారు. అవి ఆవ భూములు కావని కొందరు నేతలు అన్నారని... ఇప్పుడు గోదావరి వరదల్లో ఆ భూములు మునిగిపోవడంతో, అవి ఆవ భూములే అని నిర్ధారణ అయిందని చెప్పారు. ఎకరం భూమిని రూ. 40 లక్షలకు కొన్నారని, ఆ భూములు ముంపుకు గురి కావడం వల్ల వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని అన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టు కలెక్టర్ వద్ద నివేదికలు ఉన్నాయని చెప్పారు. దోషులపై జగన్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News