Dhoni: రిటైర్ మెంట్ ప్రకటన తరువాత ఇంటికి వింటేజ్ కారును తెచ్చిన ధోనీ!
- వింటేజ్ కారును వేలంలో కొన్న ధోనీ
- దాన్ని డ్రైవ్ చేస్తూ ఇంటికి
- వీడియో పోస్ట్ చేసిన సాక్షి
గత వారం చివర్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన ఎంఎస్ ధోనీ, ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ధోనీ నీలి రంగు భారత జెర్సీలో కనిపించే అవకాశాలు లేనప్పటికీ, మైదానంలో బ్యాట్ పట్టి, అభిమానులను మరికొంత కాలం అలరిస్తారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఇక, వాహనాలపై ఎంతో ప్రేమను కనబరిచే ధోనీ, రిటైర్ మెంట్ తరువాత, ఓ వింటేజ్ కారును ఇంటికి తీసుకుని వచ్చారట. ఓ వేలంలో దాన్ని కొనుగోలు చేసిన ధోనీ, స్వయంగా నడుపుకుంటూ ఇంటికి తేగా, అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య సాక్షి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, ఇప్పటికే ధోనీ గ్యారేజ్ లో పలు వాహనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వాటికి అదనంగా తాజాగా 'పోంటియాక్ ఫైర్ బర్డ్ ట్రాన్స్ ఏఎం' వచ్చి చేరిందని సాక్షీ సింగ్ తెలిపారు. ఇదిలావుండగా, ఇది 1970 మోడల్ కారు. ఇండియాలో చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి. ఎడమచేతి వైపు ఇంజన్ ఉండే కారులో 455 సీసీ ఇంజన్ ఉంటుంది. రెండు డోర్లతో వచ్చే ఈ కారు ధర సుమారు రూ. 60 లక్షల వరకూ పలికి ఉండవచ్చని అంచనా. కాగా, ఇప్పటికే ధోనీ వద్ద హమ్మర్ హెచ్2, ట్రాక్ హాక్, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో, మిత్సుబిషీ పాజీరో ఎస్ఎఫ్ఎక్స్, పాతతరం టయోటా కరోలా, స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న నిస్సాన్ 4డబ్ల్యూ 73, ఫస్ట్ జనరేషన్ ఆడీ క్యూ7, మెర్సిడిస్ బెంజ్ జీఎల్ఈ, లాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 వంటి ఎన్నో వాహనాలు ఉన్నాయి.