Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
- ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో చర్చ
- ఏరియల్ సర్వేకు వెళ్తున్నానన్న జగన్
- ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయం
- సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావాలి
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. మరోపక్క గోదావరి వరద పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అధికారులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, తాను ఏరియల్ సర్వేకు వెళ్తున్నానని జగన్ వారికి తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని చెప్పారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. సహాయక చర్యల్లో ఖర్చు విషయంలో వెనుకాడొద్దని చెప్పారు.
సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద తగ్గుతుందని తెలిసిందని జగన్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని ఆయన చెప్పారు.