Corona Virus: రికవరీలు పెరుగుతున్నాయి.. మరణాలు పెరుగుతున్నాయి... ఇండియాలో కరోనా పాత రికార్డులు బద్దలు!
- శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి
- అదే సమయంలో పెరిగిన రికవరీలు
- వారం రోజుల వ్యవధిలో 4.37 లక్షల కేసులు
కరోనా మహమ్మారి ఇండియాలో విస్తరిస్తున్న వేగం మరింతగా పెరిగింది. రోజువారీ మరణాలు సరికొత్త రికార్డును సృష్టించి ఆందోళన పెంచగా, రికవరీల సంఖ్య కూడా అంతే మొత్తం పెరిగి కాస్తంత ఊరటను కలిగించింది. బుధవారం నాడు ఒక్కరోజులో 1,092 మంది మరణించగా, 60,091 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక, ఒక్కరోజులో కరోనా కేసులు 2.4 శాతం పెరిగి 27,02,742 నుంచి 27,67,273కు చేరుకున్నాయి. వైరస్ కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 52,889కి పెరిగింది.
కాగా, ఇండియాలో కేవలం వారం రోజుల వ్యవధిలోనే 4.37 లక్షలకు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రతి 10 కరోనా కేసులో ఒకటి ఇండియాలోనే ఉంది. ప్రతి 15 మరణాల్లో ఒకటి భారత్ లో నమోదైంది. ప్రస్తుతం ఇండియాలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 29.4 రోజుల సమయం పడుతోంది. అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, ఆపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.