Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
- ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పై కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం
- రాగల రెండ్రోజుల్లో తెలంగాణలో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
- ఏపీలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం
ఇప్పటికే కుండపోత వానలతో అతలాకుతలమైన తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన వెలువడింది. రాష్ట్రాన్ని రెండు రోజుల పాటు వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని నివేదికలో వెల్లడించారు.
కాగా, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఆగస్టు 23న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ వానలు పడనున్నాయి. రేపు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది.