India: పాక్ కండకావరం... ఇండియాతో అణుయుద్ధం వస్తుందని, ముస్లింలు మాత్రం సురక్షితంగా ఉంటారని వ్యాఖ్య!
- మా ఆయుధాలు చాలా కచ్చితమైనవి
- ఎక్కడ పడాలో అక్కడే పడతాయి
- యుద్ధం వస్తే, అది సంప్రదాయ యుద్ధం కాదు
- అణ్వాయుధాలు మినహా మరో మార్గం లేదన్న మంత్రి రషీద్
ఇండియాను కవ్విస్తూ, పాకిస్థాన్ మరోసారి తన కండకావరాన్ని ప్రదర్శించింది. ఇండియాతో అణుయుద్ధం వస్తుందని, అయితే, తమ ఆయుధాలు ముస్లింల ప్రాణాలను కాపాడేలా కొన్ని లక్షిత ప్రాంతాల్లోకే వెళతాయని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ వ్యాఖ్యానించారు. టీవీ చానెల్ సామా కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తమ వద్ద చాలా తక్కువ ఆయుధాలు ఉన్నాయని, అయితే, అవి పరిపూర్ణమైనవని అభివర్ణించారు. అసోంపైకి కూడా ఆయుధాలను పంపించే సత్తా తమకు లభించిందని చెప్పారు.
భారత్తో మరోసారి యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని అన్న ఆయన, మరోసారి యుద్ధం సంభవిస్తే, అది సంప్రదాయ యుద్ధంగా మాత్రమే మిగలబోదని, మొదలుపెడితే అది అంతమే అవుతుందని అన్నారు. "మా దేశంపై ఇండియా దాడికి దిగితే, సంప్రదాయ యుద్ధమన్న మాటే ఉండబోదు. అది రక్తపాతాన్ని సృష్టించే అణుయుద్ధమే అవుతుంది. మా ఆయుధాలు చిన్నవే అయినా, లక్ష్యాలను తాకుతాయి. ఈ ఆయుధాలన్నీ ఇండియాలోని ముస్లిం వర్గాన్ని కాపాడేవే. ఇండియాతో యుద్ధమంటే, అణ్వాయుధాల ప్రయోగం మినహా మా వద్ద మరో మార్గం లేదు" అని ఆయన అన్నారు.
కాగా తాము అణుయుద్ధం చేయడానికి సిద్ధమంటూ పాకిస్థాన్ బెదిరింపులకు దిగడం ఇదే తొలిసారేమీ కాదు. 2019 లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్తో అణు యుద్ధం గురించి మాట్లాడారు. తమ వద్ద కూడా అటామిక్ వెపన్స్ ఉన్నాయని, వాటిని ప్రయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.