India: ఇండియాలో డిసెంబర్ 3 నుంచి కరోనా మాయం!.. ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక
- సెప్టెంబర్ లో గరిష్ఠానికి చేరనున్న కేసులు
- ఆపై క్రమంగా తగ్గుదల నమోదు
- నవంబర్ లో అన్ని ప్రాంతాల్లోనూ కేసులు తగ్గుతాయి
- పట్టణాలు, గ్రామాలపై దృష్టిని సారించాలి
ఇండియాలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న వేళ, ఊరటను కలిగించే కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, ఐఓఆర్ (ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక) విడుదలైంది. ఇప్పటికే దాదాపు 29 లక్షలకు కరోనా కేసులు చేరువైన వేళ, ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొన్న వేళ, డిసెంబర్ 3 నాటికి ఇండియాలో వైరస్ వెనుతిరిగే దశలో ఉంటుందని ఐఓఆర్ వెల్లడించింది. సెప్టెంబర్ తొలివారానికి కేసుల సంఖ్య పెరుగుదల గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసిన ఈ రిపోర్టు, ఆ సమయానికి యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 7.80 లక్షల వరకూ ఉంటుందని, ఆ తరువాత వైరస్ తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.
సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో వైరస్ అత్యధిక స్థాయిలో ఉంటుందని, ఆ తరువాత మరో 15 రోజులకు వైరస్ కరోనా హాట్ స్పాట్స్ నుంచి కూడా మాయం కావడం ప్రారంభమవుతుందని పేర్కొంది. వైరస్ వ్యాప్తి తొలి దశలో ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండి కూడా, ఇప్పుడు తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ అంచనాలు ఆశలను పెంచుతున్నాయి. ఢిల్లీలో 58 లక్షల మందిలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
వైరస్ ను ఎదుర్కునే శక్తి భారతీయుల్లో పెరుగుతోందని, నవంబర్ కెల్లా ముంబై నగరం కరోనా నుంచి బయట పడవచ్చని, చెన్నైలో అక్టోబర్ చివరి నుంచి వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ తాజా నివేదిక చెబుతోంది. ఆగస్ట్ నెలాఖరుకు బెంగళూరులో కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకుంటుందని, ఆపై నవంబర్ రెండో వారం తరువాత తగ్గుముఖం కనిపిస్తుందని వెల్లడించింది. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది.
సూరత్, జైపూర్, నాసిక్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేసిన ఐఓఆర్, నవంబర్ మూడో వారం నుంచి ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని గుర్తు చేసింది. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి రేటు 1.24కు చేరిందని, తెలంగాణలోనూ ఇవే సంకేతాలు కనిపిస్తుండటం వైరస్ నుంచి భారత్ బయట పడనున్నదన్న బలమైన సంకేతాలను పంపుతోందని చెప్పింది.