Telangana: కరోనా పరిస్థితుల్లోనూ రెట్టింపైన తెలంగాణ ఆదాయం!
- కాగ్ నివేదికలో వెల్లడి
- ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఆదాయం రెండింతలు
- తగ్గిన మూలధన వ్యయం
గత ఐదు నెలలుగా దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆదాయం రెండింతలు అయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ద్వారా వెల్లడైంది. రుణాల పెంపు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా పెరగడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల కారణంగా తెలంగాణ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రెట్టింపైంది. గతేడాది ఇదే సీజన్ లో తెలంగాణ ఆదాయం 26 శాతం కాగా, అది ఈ సీజన్ లో 53 శాతంగా నమోదైందని కాగ్ నివేదిక చెబుతోంది.
కాగా, 2019 సీజన్ తో పోల్చితే ఈ ఏడాది 3 శాతం అధికంగా వ్యయం నమోదైంది. గతేడాది బడ్జెట్ వ్యయం 18 శాతం కాగా, ఇప్పుడది 20.86గా నమోదైంది. అయితే మూలధన వ్యయంలో తరుగుదల వెల్లడైనట్టు కాగ్ పేర్కొంది. 2019లో అది 21 శాతం ఉంటే, ఇప్పుడది ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి 11 శాతం మాత్రమే ఉందని వివరించింది. పెరిగిన ఆర్థిక లోటు అందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.