Corona Virus: కౌంట్ డౌన్ మొదలు... 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్... అందరికీ ఉచితమే!
- కరోనాకు అంతిమ ఘడియలు రానున్నాయి
- తొలుత కోవీషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ
- తమకు ప్రియారిటీ లైసెన్స్ వచ్చిందన్న సీరమ్ ఇనిస్టిట్యూట్
ఇండియాలో కరోనా మహమ్మారికి మరో 73 రోజుల్లో అంతిమ ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుని, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. దేశ వాసులందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ను అందించాలని కూడా నిర్ణయించింది. తొలి కోవిడ్ వ్యాక్సిన్ సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి 'కోవీషీల్డ్' పేరిట రానుంది. ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో వస్తుందని, సీరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు 'బిజినెస్ టుడే'కు వివరాలు వెల్లడించారు.
ఇప్పటికే కేంద్రం నుంచి తమకు ఆదేశాలు అందాయని, స్పెషల్ మాన్యుఫాక్చరింగ్ ప్రియారిటీ లైసెన్స్ ను కూడా ఇచ్చారని వెల్లడించిన ఆయన, ప్రొటోకాల్ ప్రకారం అన్ని రకాల పరీక్షల అనంతరమే ఈ వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ 58 రోజుల్లో ముగుస్తాయని తెలిపారు. మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ శనివారం నాడు ప్రారంభం అయ్యాయని, ఆపై 29 రోజుల తరువాత రెండో డోస్ ఇస్తామని, దాని తరువాత 15 రోజల్లోనే ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. తుది ఫలితం వచ్చే సమయానికి వ్యాక్సిన్ ను కమర్షియల్ గా విడుదల చేయాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు.
గతంలో వ్యాక్సిన్ ను పరిశీలించాలంటే గరిష్ఠంగా ఏడు నుంచి 8 నెలల సమయం పడుతుందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ సమయాన్ని తగ్గించామని ఆయన వెల్లడించారు.కాగా, దేశవ్యాప్తంగా 17 సెంటర్లలో 1600 మందిపై ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ప్రయోగించేందుకు సీరమ్ కు ఇప్పటికే అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాతో పాటు 92 నగరాల్లో వ్యాక్సిన్ ను విక్రయించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనికాల మధ్య డీల్ కుదిరింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే వ్యాక్సిన్ తయారీపై సీరమ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు 68 కోట్ల డోస్ లను వచ్చే సంవత్సరం జూన్ నాటికి అందించే దిశగా ప్రణాళికలు రూపొందించింది. మిగతా వారికి భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వంటి కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను అందించనుంది. భారత్ బయోటెక్ ఎప్పటికి వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేస్తుందన్న సమాచారాన్ని ఇంకా కేంద్రానికి వెల్లడించలేదు. తాము త్వరితగతిన వ్యాక్సిన్ ఇవ్వాలని భావించడం లేదని, దాని సురక్షతను పూర్తిగా పరిశీలించిన తరువాతనే విడుదల చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ ఇప్పటికే వెల్లడించారు.
ఇదిలావుండగా, తొలి దశలో నెలకు 6 కోట్ల డోస్ లను, ఆపై వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి నెలకు 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేయాలని సీరమ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 200 కోట్లను పెట్టుబడిగా పెట్టి మాన్యుఫాక్చరింగ్ లైన్స్ ను కూడా సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేసే కంపెనీగా పేరున్న సీరమ్, ఏడాదికి 150 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసే సత్తాను కలిగుంది.