Italy: ఇటలీలో రెండో తాకిడి మొదలైంది... 24 గంటల్లో 1000 కరోనా కేసులు
- మొదట్లో కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన ఇటలీ
- కొన్ని రోజుల్లోనే లక్షల కేసులు
- మే 12 తర్వాత క్రమేపీ కేసుల తగ్గుదల
- మళ్లీ ఉద్ధృతమైన వైరస్ భూతం
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 2.57 లక్షల కరోనా కేసులు రాగా, 35 వేల మంది వరకు మరణించారు. ఓ దశలో కరోనా ఉద్ధృతి ఇటలీలో పతాకస్థాయికి చేరినట్టనిపించింది. అయితే ఆ తర్వాత ఎంతో శ్రమించిన ఇటలీ ప్రభుత్వం మే రెండో వారానికి సాధారణ స్థితికి తీసుకురాగలిగింది. చివరిగా మే 12న వెయ్యికి పైగా కేసులు రాగా, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 1000 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,071 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే ఇటలీ లాక్ డౌన్ ఎత్తేసింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటలీ యంత్రాంగం ప్రాముఖ్యతనిచ్చింది. అప్పటినుంచి నిత్యం వెయ్యికి లోపే కేసులు వస్తున్నాయి. తాజాగా మళ్లీ కేసులు పుంజుకుంటుండడం పట్ల అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది రెండో తాకిడి అని పేర్కొంటున్నారు.
కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో, ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇటలీ ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. ఆగస్టు 17 నుంచి నైట్ క్లబ్బులు మూసివేయాలని నిర్ణయించారు. అంతేకాదు, పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.