TRS Leader: టీఆర్ఎస్ నేత హత్యకేసును ఛేదించిన పోలీసులు... మొదటి భార్యే అసలు హంతకురాలు!
- ఆస్తి తన సవతికి పోతోందన్న కక్షతో ఘాతుకం
- భర్తను కిరాతకంగా చంపిన లక్ష్మి
- శవాన్ని సిమెంట్ పోల్ కు కట్టి చెరువులో వేసిన వైనం
వారం రోజుల కిందట హత్యకు గురైన టీఆర్ఎస్ నేత నాగరాజు కేసులో మొదటి భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆస్తి తనకు దక్కకుండా పోతుందన్న కసితో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చెంగోల్ గ్రామానికి చెందిన ఎన్.నాగరాజు ఈ నెల 12 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన కుమార్తె శ్రీయ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, నాగరాజుకు ఇద్దరు భార్యలు. ఈ కోణం నుంచి దర్యాప్తు చేసిన పోలీసులకు కొద్ది సమయంలోనే కీలక సమాచారం లభ్యమైంది. ఇద్దరి భార్యల కాల్ డేటాను పరిశీలించగా, మొదటి భార్య లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, విషయం మొత్తం వెల్లడించింది. తన ప్రియుడు బాల్ రాజ్ తో కలిసి ఈ హత్య చేసినట్టు అంగీకరించింది.
నాగరాజు తన రెండో భార్యకు ఆస్తి రాస్తున్నాడన్న కక్ష పెంచుకున్న లక్ష్మి... భర్తను చంపితే ఆ ఆస్తి మొత్తం తనదవుతుందని భావించింది. అందుకు ప్రియుడు బాల్ రాజ్ సహకారం కోరింది. గత మూడ్నెల్లుగా ఎన్నో విఫలయత్నాలు చేసిన లక్ష్మి, ఆగస్టు 12న తాను అనుకున్నది సాధించింది. నిద్రపోతున్న భర్తపై ఇనుపరాడ్ తో అత్యంత కిరాతకంగా దాడి చేసింది. అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె ప్రియుడు బాల్ రాజ్ కూడా ఆమెకు సహకరించాడు.
అయితే, నాగరాజు అరుపులు విని కుమారుడు శ్రీనాథ్ అక్కడికి రాగా, లక్ష్మి ఎలాగోలా సముదాయించి అక్కడ్నించి తీసుకెళ్లింది. ఆపై నాగరాజు మృతదేహాన్ని ఆటోలో గొల్లచెరువు వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని ఓ సిమెంటు స్తంభానికి కట్టి నీటిలో పడేశారు. లక్ష్మి చెప్పిన విషయాలతో పోలీసులు గొల్లచెరువులో గాలింపు జరపగా నాగరాజు మృతదేహం బయటపడింది. నిందితులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.