Anitha: ఇటువంటి సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడం ఏమిటి?: టీడీపీ నాయకురాలు అనిత
- కరోనాను ఎదుర్కోవడం ప్రభుత్వానికి చేత కాలేదు
- తుగ్లక్ చేష్టలతో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
- సెల్ ఫోన్లు ఇచ్చి ఆన్ లైన్ లో విద్యా బోధన చేయొచ్చు కదా?
వచ్చే నెల పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై టీడీపీ నాయకురాలు అనిత విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో స్కూళ్లను ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదని... ముఖ్యమంత్రి తుగ్లక్ చేష్టలతో కరోనా వల్ల ఇప్పటికే 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే మాస్క్ ధరించడం లేదని దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారని చెప్పారు.
ఏపీలో ప్రతి 100 మందిలో 15 మంది కరోనా వైరస్ కు గురయ్యారని అనిత అన్నారు. పిల్లలపై అంత ప్రేమ ఉంటే అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చి ఆన్ లైన్లో విద్యా బోధన చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రచార యావ ఎక్కువైందని... స్కూలు బ్యాగులకు పార్టీ రంగులు వేయాలనేదే ప్రభుత్వ ఆలోచన అని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.