Prashant Bhushan: ఒకరిని బాధించినప్పుడు.. అందుకు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది?: ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
- చీఫ్ జస్టిస్ లపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు
- క్షమాపణ చెప్పేందుకు నిరాకరణ
- అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లతో పాటు ప్రస్తుత సీజేఐ బాబ్డేపై ట్విట్టర్ ద్వారా వివాదాస్పద ఆరోపణలు చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ఒక వ్యక్తిని బాధించినప్పుడు, అందుకు క్షమాపణలు చెప్పడంలో తప్పేముందని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి వాటితో ఈ సమాజం ఇంకెంత కాలం ఇబ్బంది పడాలని అడిగారు. కొన్ని రోజుల్లో తాను పదవీ విరమణ పొందబోతున్నానని... మీరు కాని, మరెవరైనా కాని తనపై దాడి చేయడం మొదలెడితే, అది సరైనదేనా? అని ప్రశ్నించారు.
తన ట్వీట్లపై ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ప్రశాంత్ భూషణ్ నుంచి తాము ఇలాంటి ప్రతిస్పందనను ఊహించలేదని వ్యాఖ్యానించింది. 30 ఏళ్లకు పైగా న్యాయవాదిగా అనుభవం ఉన్న ఈయన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పింది. ప్రశాంత్ భూషణ్ వంటి వ్యక్తి క్షమాపణలు చెపితే... దాని ప్రభావం సమాజంపై ఉంటుందని తెలిపింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన ఈ కేసులో సుప్రీం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.