Pulwama: వీరే పుల్వామా ఉగ్రవాదులు... వాట్సాప్ లో చాట్ చేసి దొరికిపోయారన్న ఎన్ఐఏ
- 13,500 పేజీల చార్జ్ షీట్
- 19 మంది నిందితుల పేర్లు
- ఏడుగురి అరెస్ట్, ఆరుగురి హతం
- పరారీలో ఉన్న ఐదుగురు
2019లో పుల్వామాపై జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్, అతని సోదరుడు రఫూఫ్ అస్ఘర్ లు ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) పేర్కొంది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితుల పేర్లను పేర్కొంటూ 13,500 పేజీల చార్జ్ షీట్ ను తయారు చేసింది. పాకిస్థాన్ లోనే ఈ దాడికి కుట్ర జరిగిందని, ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొనగా, వారందరినీ మట్టు బెట్టామని పేర్కొంది. మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఐదుగురు పరారీలో ఉన్నారని, వీరంతా పాకిస్థానీలేనని స్పష్టం చేసింది.
గతసంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాపై ఉగ్రవాదులు దాడి చేయగా, 40 మంది భారత జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా ఇండియా లక్షిత దాడులు చేసి, బాలాకోట్ ప్రాంతంలోని జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంప్ ను నాశనం చేసింది కూడా. ఈ కేసులో ప్రధాన నిందితుడు 1999లో ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఉన్న ఇబ్రహీం అఖ్తర్ కుమారుడు మహమ్మద్ ఉమర్ ఫారూక్ అని, ఇతను మసూద్ అజర్ కు చిన్న సోదరుడని ఎన్ఐఏ పేర్కొంది.
మొత్తం 20 కిలోల ఆర్డీఎక్స్ ను వీరు పాకిస్థాన్ నుంచి సాంబా మీదుగా జమ్మూకు చేర్చారని, బాంబులను చేర్చింది ఉమర్ ఫరూఖ్ అని, ఇతన్ని ఈ సంవత్సరం మార్చిలో భద్రతా దళాలు హతమార్చాయని చార్జ్ షీట్ లో వెల్లడించింది. ఇతర పేలుడు పదార్థాలయిన అమోనియం నైట్రేట్ ను ఓ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా వీరు కొన్నారని తెలిపింది. ఉగ్రవాదులు వాట్స్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారని, ఆ వివరాలు, బాంబుల ఫోటోలు, వాటిని తరలించిన మార్గం తదితర వివరాలన్నింటినీ సేకరించామని తెలిపింది.
తొలిసారిగా పుల్వామా దాడికి వినియోగించిన ఆర్డీఎక్స్ బాంబు, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల చిత్రాలను కూడా ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఈ దాడిలో విజయవంతమైతే, వారు మరో దాడి చేయాలని ముందే ప్లాన్ చేశారని తెలిపింది. వీరంతా పాక్ దేశానికి చెందిన వారేనని చెప్పడానికి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని, వారు తీసుకుని వచ్చిన వస్తువులు, వారు మాట్లాడుకున్న వీడియో,ఆడియో రికార్డులు సాక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది.