Donald Trump: శ్వేతసౌధంలో అరుదైన ఘటన... ట్రంప్ ముందు అమెరికన్ పౌరసత్వం స్వీకరించిన భారత టెక్కీ సుధా సుందరి నారాయణన్!

Indian Techchie Sudha Sworn In As US Citizen In Rare White House Event

  • ఐదుగురికి అమెరికా పౌరసత్వం
  • దగ్గరుండి ప్రమాణం చేయించిన ట్రంప్
  • తమ దేశంలో మతం, రంగు చూడబోరని వ్యాఖ్య
  • సుధా దంపతులు అమెరికాకు ఎంతో చేశారని కితాబు

వాషింగ్టన్ లోని వైట్ హౌస్ ఓ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్న డొనాల్డ్ ట్రంప్, విదేశీ ఓటర్ల మద్దతుపై దృష్టిని సారించిన నేపథ్యంలో, ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించే కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. వీరిలో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు. కుడి చేతిని పైకి లేపి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకున్న వీరు, అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా దేశాన్ని, రంగును, మతాన్ని చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదని అన్నారు. అమెరికా ఓ అద్భుత దేశమని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో ప్రసారం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియా, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు. ట్రంప్ పక్కనే నిలబడి చూస్తుండగా, హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోందని, వారికి తన శుభాకాంక్షలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వారందరి పేర్లను చదువుతూ వివరాలు వెల్లడించిన ట్రంప్, ఇండియాలో జన్మించి, 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన సుధ, ఇప్పటికే తన కెరీర్ లో అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో చేస్తున్నారని, వారిద్దరికీ యాపిల్ పండ్ల వంటి ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చిన సుధా సుందరి, ట్రంప్ చేతుల మీదుగా పౌర పట్టాను అందుకున్నారు.

  • Loading...

More Telugu News