Sajjala Ramakrishna Reddy: స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: సజ్జల రామకృష్ణారెడ్డి
- గత ఐదేళ్లు చంద్రబాబు స్వార్థం కోసమే ఆలోచించారు
- రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పును ప్రజలపై పెట్టారు
- కరోనా సమయంలో ఆయన ఎక్కడకు వెళ్లారు?
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయి 14 నెలలు కావస్తున్నా... ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబు తన స్వార్థం కోసమే ఆలోచించారని చెప్పారు. ఐదేళ్ల పాలనలో రూ. 3 లక్షల కోట్లకు పైగా అప్పును రాష్ట్ర ప్రజలపై నెట్టారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ది పని కూడా జరగలేదని చెప్పారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారని... అవినీతి లేని పాలనను అందించడమే విధ్వంసమా? అని ప్రశ్నించారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే విధ్వంసమా? అని అడిగారు.
ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్న గొప్ప ప్రభుత్వం జగన్ దని సజ్జల అన్నారు. 14 నెలల పాలనలో రూ. 53 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా సమర్థవంతంగా పని చేస్తోందని చెప్పారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. జగన్ సంక్షేమ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రాక్షసుడిలా అడ్డుకుంటున్నారని విమర్శించారు.