Raghu Ramakrishna Raju: నన్ను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి!: రఘురామకృష్ణరాజు
- బెదిరింపులకు నేను భయపడను
- ప్రచారం కోసం స్కూళ్లను తెరవాలనుకుంటున్నారు
- డాక్టర్ గంగాధర్ పై 5 నెలల తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారు
తన సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీకి చెందిన నేతలు ఇప్పటికీ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని... ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా ఉపయోగం ఉండదని అన్నారు. తనను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలితే మంచిదని హితవు పలికారు. వేధింపులకు తాళలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తాను ఆ రకం కాదని చెప్పారు.
ఎంతో అనుభవం ఉన్న రామచంద్రమూర్తి సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని రఘురాజు అన్నారు. డాక్టర్ రమేశ్ ను వేధిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. ఆయన సామాజికవర్గాన్ని సూచించేలా పేరు చివరన చౌదరి అని తగిలించి వేధిస్తున్నారని మండిపడ్డారు.
ప్రచారం కోసం పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురాజు విమర్శించారు. జగనన్న బూట్లు, బట్టలు ఇచ్చేందుకు వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లను తెరుస్తామని ప్రకటిస్తున్నారని అన్నారు. ఇప్పట్లో స్కూళ్లను తెరిచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పారు.
ప్రభుత్వం తాము ఇచ్చిన భూములకు కౌలు చెల్లించలేదని అమరావతి రైతులు నిరసన చేపడితే... వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రఘురాజు దుయ్యబట్టారు. కౌలు చెల్లించడానికి డబ్బు లేనప్పుడు... మూడు రాజధానులు అవసరమా? అని ఎద్దేవా చేశారు. పీపీఈ కిట్లు లేవని గతంలో విమర్శించిన డాక్టర్ గంగాధర్ పై 5 నెలల తర్వాత ఇప్పుడు కేసులు పెడుతున్నారని... ఇది కక్ష సాధింపు కాదా? అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి గంగాధర్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని చెప్పారు.
ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేస్తుంటే... తనను రాజీనామా చేయమంటున్నారని రఘురాజు మండిపడ్డారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే మూడు రెట్ల మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టు నిర్ణయం మంచి పరిణామమని అన్నారు.