Corona Virus: కొవిడ్‌తో ఆసుపత్రిలో మృతి చెందిన మహిళ.. ఐదు తులాల బంగారు ఆభరణాలు మాయం!

5 tola Gold missing from a woman who died in a hospital

  • కరోనాతో బాధపడుతూ నెల్లిమర్లలోని ‘మిమ్స్’లో చేరిన మహిళ
  • మంగళవారం మృతి.. మృతదేహంపై నగలు మాయం
  • అసుపత్రిలో అలా జరిగే అవకాశం లేదన్న కొవిడ్ ప్రత్యేక వైద్యాధికారి

కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ శరీరంపై ఉండాల్సిన 5 తులాల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనా బారినపడి నెల్లిమర్లలోని ‘మిమ్స్’ ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మృతదేహంపై కప్పిన కవర్‌ను తొలగించి చూడగా, ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు.

బాధిత మహిళ బంధువుల ఆరోపణలపై జిల్లా కొవిడ్ ఆసుపత్రి ప్రత్యేక వైద్యాధికారి హరికిషన్ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఆసుపత్రిలో మృతురాలి బంగారు నగలు పోయేందుకు అవకాశం లేదని, అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయని అన్నారు. నిజానికి కరోనా భయంతో ఎవరూ దగ్గరికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని అన్నారు. మృతదేహాన్ని బంధువులు తరలించే సమయంలోనే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని నెల్లిమర్ల పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News