Somu Veerraju: అందుకే అమరావతి రైతులు రోడ్డెక్కారు: సోము వీర్రాజు
- కౌలు చెల్లించి ఆదుకోవలసిన అవసరం ఉంది
- గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
- ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచాయి
- రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను
తమకు రావలసిన కౌలు మొత్తం అడిగేందుకు న్యాయం కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన రైతులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వారి పట్ల ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమి త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం తీరు గర్హనీయం. 28 వేలమంది పైగా రైతుల త్యాగానికి కరోనా కష్టకాలంలో కౌలు చెల్లించి ఆదుకోవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను' అని చెప్పారు.
'రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయానికి మించి 100 రోజులు గడిచినందున రైతులు రోడ్డెక్కారు. జూన్ 21వ తేదీన కౌలు రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా సాంకేతిక కారణాలు చూపించి ఎవరికీ డబ్బు జమ చేయకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే' అని అన్నారు.
'తమకు రావలసిన కౌలు మొత్తం అడిగేందుకు న్యాయం కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చినవారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. ఇంకా ఎవరినైనా విడుదల చేయకపోతే వెంటనే విడుదల చేసి భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి సత్వరమే పరిష్కారమార్గాన్ని చూడాలని డిమాండ్ చేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.