AP High Court: ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై స్టేటస్ కో వచ్చేనెల 21 వరకు పొడిగింపు.. హైకోర్టు ఆదేశాలు
- కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు సమయం
- అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు
- తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అవి అమలు కాకుండా ప్రస్తుత స్టేటస్ కోను వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇచ్చింది.
ఈ రోజు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది నితీశ్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు. దీనిపై కూడా వచ్చేనెల 10 లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
కాగా, స్టేటస్‌కోను ఎత్తేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించడం, హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోమంటూ ఆ పిటిషన్లను నిన్న అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం తెలిసిందే.