Surya: అమెజాన్ ప్రైమ్ లో సూర్య కొత్త సినిమా.. 200 దేశాలలో స్ట్రీమింగ్!
- సూర్య సంచలన నిర్ణయం వివాదాస్పదం
- తాజా చిత్రం అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్
- డిజిటల్ ప్లాట్ ఫాంపై రికార్డు నమోదు
తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు తమిళ నాట సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో తను హీరోగా తానే నిర్మించిన 'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరిట అనువదిస్తున్నారు) చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.
థియేటర్లు మూతబడడంతో ఇక ఎక్కువ కాలం ఆగలేక ఈ చిత్రాన్ని ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి డైరెక్టు రిలీజ్ కి ఇచ్చేశాడు. దీంతో తమిళనాడులోని థియేటర్ల యజమానులు సూర్యపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అతని సినిమాలను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే, సూర్య ఇవేమీ ఖాతరు చేయకుండా ఓటీటీ రిలీజ్ కే ముందుకు సాగుతున్నాడు.
ఈ క్రమంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ ద్వారా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 150 దేశాలలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి ప్రాథమికంగా నిర్ణయించినట్టు నిన్నటివరకు వార్తలొచ్చాయి. అయితే, చిత్ర సహ నిర్మాత అయిన రాజశేఖర్ పాండియన్ తాజాగా మరో వార్తను వెల్లడించారు. మొత్తం 200 దేశాలలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తామని ఆయన ప్రకటించారు. వివిధ ప్రాంతాలలో సూర్యకున్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఇన్ని దేశాలలో చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క, డిజిటల్ ప్లాట్ ఫాంపై ఎక్కువ మంది చూసిన చిత్రంగా రికార్డు నెలకొల్పాలన్నది కూడా సూర్య యోచనగా కనిపిస్తోంది.