Jatin Prasada: లేఖపై సంతకం చేసిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్!
- అధిష్ఠానానికి యూపీ నేతల లేఖ
- క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్
- దురదృష్టకరమన్న జితిన్ ప్రసాద
నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని విమర్శిస్తూ, రాసిన లేఖ వెనుక కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద హస్తం కూడా ఉందని, ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు యూపీ పీసీసీ విభాగం పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖను రాస్తూ, అందులో జితిన్ ప్రసాద పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది.
కాగా, ఈ లేఖపై మరో సీనియర్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ ట్విట్టర్ లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "కాంగ్రెస్ పార్టీ అధికారికంగా జితిన్ ప్రసాదను టార్గెట్ చేయడం దురదృష్టకరం. దీనికి బదులు బీజేపీపై లక్షిత దాడులు చేయాల్సింది. కాంగ్రెస్ నేతలు తమ శక్తిని ఇలా వృథా చేస్తున్నారు" అని అన్నారు. సీనియర్లు రాసిన లేఖపై కపిల్ సిబల్ కూడా సంతకం చేసిన సంగత తెలిసిందే.
ఇక, సిబల్ ట్వీట్ పై మనీష్ తివారీ స్పందిస్తూ, సిబల్ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, 23 మంది కాంగ్రెస్ నేతలు పార్టీలో సంస్కరణలను అమలు చేయాలని సూచిస్తూ, సోనియాకు లేఖ రాయగా, అది పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పార్టీని సమర్ధవంతంగా నడిపించే నాయకుడి అవసరం ఎంతైనా ఉందని, పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని వారు కోరిన సంగతి తెలిసిందే.
ఇక ఈ 23 మంది పార్టీ అధినేత్రిపై అసంతృప్తిని వ్యక్తం చేసినందున అందరిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని యూపీలోని లక్ష్మీపూర్ కేహ్రీ జిల్లా యూనిట్ లేఖ రాసింది. యూపీకి చెందిన పార్టీలోని ప్రముఖ బ్రాహ్మణ నేత అయిన జితిన్, ఇదే జిల్లాలోని దౌరాహ్రా లోక్ సభ స్థానానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ లెటర్ లో సంతకం చేసిన ఏకైక యూపీ నేత ఆయనే కావడం గమనార్హం.