Sajjala Ramakrishnareddy: ఊళ్లలో జరిగే గొడవల్ని ప్రభుత్వంపైకి నెడుతూ తాను దళితోద్ధారకుడ్నని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు: సజ్జల
- చంద్రబాబు వంటి దళితద్రోహి మరొకరు లేరన్న సజ్జల
- చంద్రబాబువి దళిత వ్యతిరేక చర్యలని వెల్లడి
- దళితుల కోసం ఏంచేశారంటూ ఆగ్రహం
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఊళ్లలో జరిగే గొడవల్ని ప్రభుత్వంపైకి నెడుతూ తాను దళితోద్ధారకుడ్నని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి దళిత ద్రోహి మరొకరు లేరని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దనలేదా? ఇళ్ల పట్టాలను కోర్టు కేసుల పేరుతో అడ్డుకోలేదా? అమరావతిలో పేదవారికి ఇళ్లు ఇవ్వనీయకుండా డెమోగ్రఫీ మారిపోతుందని తన మనుషులతో హైకోర్టులో చెప్పించలేదా? ఇవన్నీ దళిత వ్యతిరేక చర్యలు కాదా? అని సజ్జల ప్రశ్నించారు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ ఏంజరిగినా వెంటనే చర్యలు తీసుకుంటోందని, పోలీసు అధికారులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు.
"ఈ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో పలు నగదు బదిలీ పథకాల ద్వారా 87 లక్షల మంది ఎస్సీల ఖాతాల్లో నేరుగా డబ్బు జమచేసింది. మీ పాలనలో ఏనాడైనా ఇంతమందికి సాయం చేశారా చంద్రబాబూ? రాష్ట్ర కేబినెట్లో ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ మంత్రులుగా ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా, ఎస్సీ మహిళ హోంమంత్రిగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ పద్ధతిలో అప్పగించే పనుల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తూ చట్టాలు కూడా చేయడం జరిగింది. ఈ వర్గాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఇందులో ఒక్కటైనా చంద్రబాబు ఎప్పుడైనా చేశారా?" అంటూ సజ్జల ట్విట్టర్ లో స్పందించారు.