Chennai: ఆసియాలోనే తొలిసారి.. కొవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి చేసిన చెన్నై వైద్యులు
- చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో విజయవంతంగా లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
- బ్రెయిడ్ డెడ్ అయిన రోగి నుంచి ఊపిరితిత్తుల సేకరణ
- కోలుకుంటున్న బాధితుడు
కరోనా బారినపడి ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగికి చెన్నై వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేసి రికార్డులకెక్కారు. కొవిడ్ రోగికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఆసియాలోనే ఇది తొలిసారి. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ వైద్యులు ఈ ఘనత సాధించారు.
ఆసుపత్రి చైర్మన్, డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ కథనం ప్రకారం.. గురుగ్రామ్‌కు చెందిన 48 ఏళ్ల వ్యాపారవేత్త జూన్ 8న కొవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వైరస్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆయనను వెంటిలేటర్ సాయంతో విమానంలో చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనకు ఎక్మో చికిత్స అందించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్ చేసి ఊపిరితిత్తులు అమర్చినట్టు డాక్టర్ బాలకృష్ణన్ తెలిపారు. నగరంలోని గ్లెనెగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ఆయనకు అమర్చినట్టు తెలిపారు. ఇప్పుడాయన ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయని, ఎక్మో సపోర్టు తొలగించామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి కో డైరెక్టర్ డాక్టర్ సురేశ్ రావు తెలిపారు. కొవిడ్ రోగికి లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించడం ఆసియాలోనే ఇది తొలిసారని, ఈ ఆసుపత్రిలో రెండోసారని ఆయన వివరించారు.