China: చైనా మరింత దూకుడు... సరిహద్దుల్లోనే ఏకంగా ఎయిర్ బేస్ లు!
- పాంగ్ యాంగ్ సరస్సుకు సమీపంలో నూతన నిర్మాణాలు
- ట్రై జంక్షన్ వద్ద ఎయిర్ బేస్ లు
- క్షిపణులను ఛేదించే వ్యవస్థల ఏర్పాటు
సరిహద్దుల్లో నెలకొన్న వివాదాలకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఇండియా ప్రయత్నిస్తున్న వేళ, చైనా మరింత దూకుడును ప్రదర్శిస్తూ, ఈ దఫా ఏకంగా ఎయిర్ బేస్ నే నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాంగ్ యాంగ్ సరస్సు పక్కనే నూతన నిర్మాణాలను చేపట్టిన చైనా, డోక్లాం, నకుల్లా, సిక్కిం సెక్టార్ల సమీపంలో విమానాలను నిలిపేందుకు ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు నిర్మిస్తోంది. తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు ఈ విషయంపై సాక్ష్యాలను అందిస్తున్నాయి. డోక్లాం పీఠభూమిలో మూడు దేశాల (ఇండియా, భూటాన్, చైనా) ట్రై జంక్షన్ కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కాగా, ఇదే ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం చైనా, ఇండియాల మధ్య సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి 50 కిలోమీటర్ల దూరంలోనే చైనా కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయని ఉపగ్రహాల చిత్రాలు చూపుతున్నాయి. డెటెస్ఫా పేరిట ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఈ చిత్రాలను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సరిహద్దులకు ఆవలి నుంచి వచ్చే క్షిపణులను ఛేదించేలా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు దేశాలూ సరిహద్దుల నుంచి తమతమ బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించినా, చైనా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. సైన్యాన్ని వెనక్కు తీసుకుని వెళుతున్నామని చెబుతూనే, మరింత మందిని బార్డర్ ఏరియాల్లో చైనా మోహరిస్తోంది. శీతాకాలం రానుండటంతో, పెద్దఎత్తున గుడారాలు నిర్మిస్తోంది. ఈనేపథ్యంలో మరోమారు ఉద్రిక్తతలు ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.