Doctor: చేతులకు పది గంటలు గ్లౌజ్ లు వేసుకుంటే... డాక్టర్ షేర్ చేసిన పిక్!
- 10 గంటల పాటు నిర్విరామంగా డ్యూటీలో
- గ్లౌజస్ తీయకపోవడంతో చెయ్యంతా ముడతలు
- యూపీ వైద్యుడి పిక్ వైరల్
కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులే ముందు నిలిచారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. నిరంతరం వైద్యులు పడుతున్న శ్రమతోనే రికవరీల సంఖ్య అధికంగా ఉంటూ, మరణాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిద్రాహారాలు మాని, ఇంటికి దూరమై, ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా కూడా పెడుతున్నారు. ఊపిరాడని విధంగా పీపీఈ కిట్లు ధరించడంతో పాటు, చేతులకు గ్లౌజులు వేసుకుని గంటల తరబడి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్, 10 గంటల పాటు గ్లౌజ్ లను ధరించడం వల్ల తన చేతులు ఇలా మారిపోయాయంటూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు, కరోనా రోగులకు చికిత్స చేసే నిమిత్తం గంటల తరబడి చేతులకు తొడుగులు తొడుక్కోవాల్సి వచ్చింది. ఓ వార్డులో నుంచి పది గంటల పాటు అతను బయటకు రాలేక పోయాడు. కనీసం విశ్రాంతికి కూడా సమయం లేకపోగా, గ్లౌజ్ లను మార్చేందుకు కూడా వీల్లేకపోయింది.
ఆపై రౌండ్స్ తరువాత చేతులకు గ్లౌజ్ లు తీయగా, మొత్తం చెయ్యంతా ముడతలు పడిపోయి కనిపించింది. దీన్ని ఫోటో తీసిన సయ్యద్, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు వేల కొద్దీ లైక్స్ రాగా, కరోనాపై చికిత్సలో తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన బెడుతున్న మీ వంటి వైద్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదంటూ కామెంట్లు పెడుతున్నారు.
వాస్తవానికి ప్రతి ఐదు గంటలకూ ఓ మారు వైద్యులు తమ చేతి తొడుగులను మార్చుకోవాలి. అందుకు దాదాపు 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. తమ వద్ద ఆ మాత్రం సమయం కూడా ఉండటం లేదని, విధుల్లో ఒక్కరమే ఉండాల్సి వస్తుండటమే ఇందుకు కారణమని, డాక్టర్లే వార్డ్ బాయ్, నర్స్ బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి వస్తోందని, ఒక్కోమారు తన ఫిష్ట్ ముగిసినా వెళ్లే వీలుండదని ఈ సందర్భంగా సయ్యద్ వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్లు ధరించి పని చేస్తుంటే నరకంగా ఉంటుందని, శరీరంలో చెమట పట్టి, దాన్ని తుడుచుకోలేని పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.