Andhra Pradesh: ఏపీలో కరోనా విలయతాండవం... కేసుల్లో రెండో స్థానానికి!
- తమిళనాడును దాటేసిన ఏపీ
- గత ఐదు రోజుల్లో 50 వేలకు పైగా కొత్త కేసులు
- టెస్టుల విషయంలో మిగతా రాష్ట్రాలకన్నా ముందు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఇంతవరకూ దేశంలో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించేసింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 4.24 లక్షలకు పైగానే కేసులున్నాయి. గడచిన ఐదు రోజులుగా ఏపీలో నిత్యమూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం గమనార్హం.
ప్రస్తుతం తమిళనాడులో 4.16 లక్షలకు పైగా కేసులుండగా, ఏపీ దాన్ని అధిగమించింది. అయితే, టెస్టుల విషయంలో మాత్రం ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందు నిలిచింది. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 68,660 మందికి ఇప్పటికే కరోనా పరీక్షలు జరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, ఏపీలో 9,067 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 88 మంది మరణించారు. ఇప్పటివరకూ 3.21 లక్షల మందికి పైగా వ్యాధి బారి నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల నుంచి వెయ్యేసికి పైగానే కేసులు వస్తున్నాయి. ఆపై పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 900కి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.