Prashant Bhushan: కోర్టు ధిక్కార కేసులో ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా.. చెల్లించకపోతే 3 నెలల జైలు!

Prashant Bhushan Fined Re 1 By Supreme Court In Contempt Case

  • న్యాయమూర్తులపై గతంలో ప్రశాంత్‌ అమర్యాదకర వ్యాఖ్యలు 
  • ఇటీవలే దోషిగా తేల్చిన కోర్టు  
  • సెప్టెంబరు 15లోగా జరిమానాను కట్టాలని ఆదేశం
  • విఫలమైతే మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయడానికి వీల్లేదు 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ప్రస్తుత సీజే జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్ ‌భూషణ్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి, ఆయనను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిక్ష విధింపుపై కూడా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆయనకు ఈ రోజు శిక్షను ఖరారు చేసింది.

ఆయనకు కోర్టు ఒక్క రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. ఒకవేళ ఆ సమయంలోపు రూ.1 జరిమానా కట్టడంలో విఫలమైతే కనుక, మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయకుండా నిషేధం విధిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంపై ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. దీంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, కొన్ని రోజుల క్రితం సీజే బోబ్డే ఖరీదైన బైక్‌ పై హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో. కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది.

ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. తనకు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని అభిప్రాయాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.

  • Loading...

More Telugu News