AC Muthaiah: బీసీసీఐ మాజీ చీఫ్ ఏసీ ముత్తయ్యను 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా ప్రకటించిన ఐడీబీఐ
- రూ.508 కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు
- ఇప్పటికే ముత్తయ్యపై సీబీఐ కేసులు
- భారత క్రికెట్ తో సన్నిహిత సంబంధాలు
ప్రముఖ వ్యాపారవేత్త ఏసీ ముత్తయ్య చిక్కుల్లో పడ్డారు. ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా సహ ప్రమోటర్లలో ఒకడైన ఏసీ ముత్తయ్యను ఐడీబీఐ బ్యాంక్ 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా ప్రకటించింది. ఆయన కో ప్రమోటర్ గా ఉన్న ఫస్ట్ లీజింగ్ సంస్థ చెల్లించాల్సిన రూ.508.40 కోట్లు చెల్లించకపోవడంతో బ్యాంకు ఈ మేరకు ప్రకటన చేసింది. ఆగస్టు 27 నాటికి ముత్తయ్యతో పాటు ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రమోటర్/డైరెక్టర్ ఫారూక్ ఇరానీ ఈ చెల్లింపులు చేయనందున వారిద్దరూ చట్టప్రకారం ఎగవేతదారులు అయ్యారని ఐడీబీఐ పేర్కొంది.
ఏసీ ముత్తయ్య, ఫారూఖ్ ఇరానీతో కలిసి ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఐడీబీఐ సహా మరో మూడు బ్యాంకులకు టోకరా వేశారంటూ 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ మరుసటి ఏడాది సిండికేట్ బ్యాంకును వంద కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ మరో కేసు నమోదుచేసింది. నకిలీ పత్రాలతో రుణాలు తీసుకుని, ఆ నిధులను దారి మళ్లించినట్టు వారిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఏసీ ముత్తయ్యకు భారత క్రికెట్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన 1994-95, 2001-02 సీజన్లకు గాను తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 నుంచి 2001 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు.