North Korea: ఉత్తర కొరియా నుంచి మరో షాకింగ్ న్యూస్.. నెల రోజులుగా బయటకు రాని కిమ్ సోదరి!
- తనకంటే ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని కిమ్ కినుక
- సోదరుడి ఆగ్రహంతో జులై 27 నుంచి బయటకు రాని యో జాంగ్
- నిజమేనంటున్న విశ్లేషకులు
ఉత్తర కొరియా నుంచి గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కోమాలో ఉన్నారని ఒకసారి, చనిపోయారని మరోసారి, ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌కు సగం అధికారాలు కట్టబెట్టారని ఇంకోసారి కథనాలు వెలువడ్డాయి. కిమ్ సలహాదారు కూడా అయిన జాంగ్ ఇటీవల వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తన సోదరుడిని విమర్శించేవారిపై విరుచుకుపడ్డారు. కవ్వింపులకు దిగితే సహించబోమని ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికైన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
విదేశాంగ విధానాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న కిమ్ యో జాంగ్ పేరు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వినిపించింది. అయితే, సోదరికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి కిమ్ తట్టుకోలేకపోతున్నారంటూ తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. జులై 27 నుంచి జాంగ్ బహిరంగంగా కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికార వర్కర్స్ పార్టీలో సభ్యురాలైన జాంగ్ సోదరుడి ఆగ్రహం, ఆదేశాల కారణంగానే బయటకు రావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమంటూ జాంగ్ జారీ చేసిన ఆదేశాలను సైతం కిమ్ నిలిపివేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎటొచ్చీ, ఉత్తర కొరియా విషయంలో బయటకు వస్తున్న అన్ని వార్తల్లానే ఇందులోనూ స్పష్టత కరవైంది.