Congress: కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆజాద్ లకు కేంద్ర మంత్రి సాదర ఆహ్వానం
- పార్టీని నిర్మించిన వారికి గుర్తింపు దక్కలేదు
- మళ్లీ ఎన్డీయేదే అధికారం
- సింధియాలా మీరు కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి రండి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసి కలకలం రేపిన సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్‌లను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బీజేపీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో ఇన్నేళ్లపాటు కొనసాగినా గౌరవం లభించనందుకు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి తమతో చేరాలని అథవాలే కోరారు. వారిద్దరూ పార్టీ కోసం ఎంతో చేశారని, అయినప్పటికీ వారికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాదిత్య సింధియాలా బీజేపీలో చేరాలని సూచించారు.
మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అథవాలే.. కపిల్ సిబల్, ఆజాద్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడమే మంచిదన్నారు. కష్టపడి పార్టీని నిర్మించిన వారిపై ఆరోపణలు చేయడం తగదని రాహుల్‌కు హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 350కిపైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాగా, నాయకత్వ మార్పు విషయంలో సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో కపిల్ సిబల్, ఆజాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే.