NCRB: గతేడాది ఆత్మహత్యల గణాంకాల వెల్లడి.. జాబితాలో మహారాష్ట్ర టాప్!
- జాబితా విడుదల చేసిన ఎన్సీఆర్బీ
- మహారాష్ట్రలో 18 వేల మందికిపైగా ఆత్మహత్య
- పది రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు నిల్
దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో మహారాష్ట్ర ముందువరుసలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది 18 వేలకిపైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
ఇక, 13 వేలకుపైగా ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ 12 వేలకు పైగా ఆత్మహత్యలతో మూడోస్థానంలో నిలవగా, నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. మధ్యప్రదేశ్లో 12,457 మంది, కర్ణాటకలో 11,288 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 49.5 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి.
ఇక, తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 2,858 మంది కూలీలే ఉండడం గమనార్హం. అలాగే, 499 మంది రైతులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. 6,465 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది.
కాగా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, చండీగఢ్, డామన్ అండ్ డయ్యు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక, సామూహిక/కుటుంబ ఆత్మహత్యల్లో తమిళనాడు 16 ఘటనలతో అగ్రస్థానంలో ఉండగా, 14 ఘటనలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.