America: యాంటీబాడీలపై సందేహాలు పటాపంచలు.. నాలుగు నెలలపాటు యాక్టివ్గానే!
- అమెరికాలో నిర్వహించిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడి
- వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలకు ఆలంబన కాగలదన్న అధ్యయనం
- న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో అధ్యయన నివేదిక
కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తర్వాత అతడి శరీరంలో అభివృద్ధి చెందే యాంటీబాడీలపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ తాజా పరిశోధన ఒకటి యాంటీబాడీలపై మరింత స్పష్టత నిచ్చింది. కరోనా చికిత్స అనంతరం నాలుగు నెలలపాటు అవి యాక్టివ్గానే ఉంటాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ ఆమ్జెన్.. పలు ఆసుపత్రులు కలిసి ఐస్లాండ్లో అధ్యయనం నిర్వహించాయి.
ఇందులో భాగంగా మొత్తం 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో కనీసం నాలుగు నెలలపాటు యాంటీబాడీలు చైతన్యంగా ఉంటాయని అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ విషయంలో రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గురించి ఈ అధ్యయనంలో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయని, వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలకు ఈ విషయాలు దోహదం కాగలవని నిపుణులు చెబుతున్నారు.