Money Transfer: 'ఉచిత్ విద్యుత్-నగదు బదిలీ'కి ఏపీ కేబినెట్ ఆమోదం
- సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
- ఉచిత విద్యుత్ కు నగదు బదిలీపై చర్చ
- రైతులపై ఒక్క పైసా భారం పడదన్న సీఎం
ప్రజా పథకాలకు నగదు బదిలీ తప్పనిసరి చేస్తూ కేంద్రం సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉచిత విద్యుత్ పథకానికి కూడా నగదు బదిలీ వర్తింపచేయనున్నారు. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో 'ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ' విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ఈ నగదు బదిలీ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం తీసుకువస్తున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ పూర్తి ఉచితమేనని స్పష్టం చేశారు.
అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షనను క్రమబద్ధీకరిస్తామని, కనెక్షన్ల తొలగింపు ఉండదని భరోసా ఇచ్చారు. కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని వివరించారు.
మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, అనంతరం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన విధానం అమలవుతుందని సీఎం జగన్ చెప్పారు. మరో 35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా ఉండబోదని అన్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ ఒక్క వైఎస్సార్ కు మాత్రమే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు.